గౌడపాద కారికలు

2026-05-12

Telugu

కారికలు అంటే ఏమిటి? అనే ప్రశ్నకు వే.బ్ర.శ్రీ పారాయణం లక్ష్మీకాంత శర్మ గారి 'అధ్యాత్మసంవాదం' అనే పుస్తకంలో ఇలా వివరించబడినది - శి:- గురువర్యా, ఇక గౌడపాద కారికులు అన్నారు కదా, అవి ఏవి?

గు:- శ్రీశంకరాచార్యుల పరమగురువులు శ్రీగౌడపాదాచార్యుల వారు. వారు మాండూక్యోపనిషత్తుకు కారికలు వ్రాశారు.

శి:- స్వామి, నూటఎనిమిది ఉపనిషత్తులు ఉండగా శ్రీ గౌడపాదులు మాండూక్యానికి మాత్రం కారికలు ఏల వ్రాశారు?

గు:- ముక్తికోపనిషత్తు 'మాణూక్యమేకమేవాలం ముముక్షణాం విముక్తయే' ముముక్షువు లకు ముక్తికి ఒక్క మాండూక్యమే చాలు అంటుంది. సకలోపనిషత్సారం ఇది. దీన్ని గురువులవల్ల బాగా వింటే అన్ని ఉపనిషత్తులు హస్తగతం అవుతాయి. అందుకే శ్రీ గౌడపాదులు దానికి మాత్రం కారికలు రచించారు.

శి:- ఆచార్యా, కారిక అంటే ఏమిటి?

గు:- విను. అల్పాక్షరత్వే సతి బహ్వర్థజ్ఞాపకః శ్లోకః - కొన్ని అక్షరాలే గలిగి అధికంగా అర్థాన్ని తెలియపరచే శ్లోకాన్ని కారిక అంటారు. శ్రుతులలో సూత్రప్రాయంగా ఉక్తమైన అర్థాన్ని పరిమితమైన అక్షరాల్లో వివరించడమే కారిక అంటే. ఉపనిషద్వాక్యాలు సమాసవ్యాసపద్దతిలో ఉంటాయి. అనగా అవి తత్త్వాన్ని సూత్రప్రాయంగా తెలుపుతాయి. అవుడు జిజ్ఞాసువులకు శ్రుతిభావాన్ని ప్రస్ఫుటపరచాల్సివుంటుంది. కనుక కారికలు వెలిశాయి. శ్రీగౌడపాదులవారి మాండూక్యకారికలే తర్వాతి శ్రీశంకరాచార్యులవారికి భాష్యరచనలో మార్గదర్శకంగా ఉన్నందున కారికలు వేదాంతంలో ప్రముఖస్థానాన్ని సంతరించుకున్నాయి.

All reflections